లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గుడ్ న్యూస్. ఆ జట్టు పేస్ సెన్సేషన్, యువ పేసర్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. సంచలన బౌలింగ్‌తో ఔరా అనిపించిన ఈ కుర్రాడు.. పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. 155 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేసి ప్రత్యర్థులను బెంబేలెత్తించడంతో పాటు లక్నోకు సంచలన విజయాలు అందించాడు.
అయితే అతను గాయం నుంచి పూర్తి కోలుకున్నాడని, అన్ని రకాల ఫిట్నెస్ టెస్ట్‌లను క్లియర్ చేశాడని లక్నో సూపర్ జెయింట్స్ సోమవారం ప్రకటించింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌తో మయాంక్ యాదవ్ మైదానంలో అడుగుపెడుతాడని తెలిపాడు. ఈ సీజన్లో మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసాడు. ఎకానమీ 6 కాగా.. యావరేజ్ 9. అతని కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు పేస్ వేరియేషన్స్ బ్యాటర్లను భయపెడుతోంది. మయాంక్ యాదవ్ రీఎంట్రీతో లక్నో సూపర్ జెయింట్స్ బలం రెట్టింపు కానుంది.
టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించే ముందు మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అతన్ని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలనే డిమాండ్ బాగా వినిపించిన నేపథ్యంలో రీఎంట్రీలో సత్తా చాటితే సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్ జరిగే అమెరికా, వెస్టిండీస్ పిచ్‌లు మయాంక్ యాదవ్ పేస్‌కు సరిగ్గా సరిపోతాయి. అయితే అతన్ని తుది జట్టులోకి తీసుకోకపోయినా.. నెట్బౌలర్గానైనా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతని ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ చెలరేగితే.. అతని ప్రపంచకప్ జట్టుతో ఫ్లైట్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి.