పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు కాంస్య పతకాలు సాధించింది. మను బాకర్, సరబ్జోత్ సింగ్ పతకాలను అందుకున్నారు. అయితే ఈ ఇద్దరూ మెడల్స్‌తో పాటు ఓ పొడవాటి బాక్సును కూడా తీసుకున్నారు. ఆ బాక్సులో అసలు ఏముందనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. మరోవైపు బంగారు పతకం ఖరీదు ఎంత, ఇతర పతకాలు కూడా కాస్ట్లీనేనా అనే ప్రశ్నలు అభిమానులు వస్తున్నాయి.
పోడియంపై నిల్చుని విజేతలు పతకాన్ని అందుకుంటారు. అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన వాళ్లకు స్వర్ణం, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న వాళ్లకు రజతం, కాంస్యం అందివ్వడం సాధారణమే. అయితే ఈసారి ప్రత్యేకంగా ఓ బాక్స్ అదనంగా ఇస్తున్నారు. అయితే అందులో ఎలాంటి ఖరీదైన గిఫ్ట్ లేదు. పారిస్ ఒలింపిక్స్ అధికారిక పోస్టర్ అందులో ఉంది.
40 సెంటిమీటర్ల ఆ కార్డ్బోర్డ్ బాక్సులో ఖరీదైన గిఫ్ట్ ఉంటుందేమో అని ఎంతో మంది భావించారు. కానీ దానిలో పోస్టర్ మాత్రమే ఉంది. ఈ పోస్టర్‌ను ఆతిథ్య దేశమైన ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ట్ డైరెక్టర్ ఉగో గటోనీ రూపొందించాడు. ఇక క్రీడాకారులు అందుకునే గోల్డ్ మెడల్ తయారీ ధర భారత కరెన్సీలో సుమారు రూ.86 వేలు. రజతం విలువ దాదాపు రూ.40 వేలు ఉంటుంది. ఇక కాంస్య పతకం విలువ చాలా తక్కువ.
అయితే పసిడి పతకంలో పూర్తిగా బంగారం ఉండదు. వెండితో తయారు చేస్తారు. దానిపైనే బంగారు పూత పోస్తారు. 1912 స్టాక్‌హోమ్ ఒలింపిక్స్ వరకు గోల్డ్ మెడల్స్ పూర్తిగా బంగారంతోనే చేసేవారు. అయితే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒలింపిక్స్ నిర్వహణ వ్యయాలను తగ్గించే క్రమంలో స్వర్ణ పతకం తయారీలో మార్పులు చేశారు.
ప్రస్తుతం స్వర్ణ పతకం బరువు 529 గ్రాములుండగా, అందులో బంగారం ఆరు గ్రాములే. అంటే గోల్డ్ మెడల్లో గోల్డ్ ఉండేది 1.3 శాతమే. సిల్వర్ మెడల్‌ను వెండితోనే చేస్తారు. కాంస్య పతకాన్ని కాపర్, టిన్, జింక్ వంటి ఖనిజాల మిశ్రమంతో తయారు చేస్తారు.