ఐపీఎల్ 2024 సీజన్‌పై చెన్నై సూపర్ కింగ్స్ తన పట్టు నిలుపుకొంటోంది. ఒకట్రెండు అపజయాలు ఎదురైనా వెనక్కి తగ్గట్లేదు. దూకుడుగా ముందడుగు వేస్తోంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ ఎల్లో ఆర్మీ.. సమష్టిగా సత్తా చాటుతోంది. ఆరోసారి ఛాంపియన్‌గా నిలవడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది.
అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లో విజయాలను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. తన తదుపరి మ్యాచ్‌లో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టడానికి సమాయాత్తమౌతోంది. ఈ ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు వాంఖెడే స్టేడియంలో షెడ్యూల్ అయింది.
ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. అతని కోసం తమిళ ఫ్యాన్స్ దేనికైనా వెనుకాడరు. ఓ మాస్ హీరో లెవెల్‌లో అతణ్ని అభిమానిస్తారు. ఆరాధిస్తారు. గత ఏడాది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల ఒకరోజు వాయిదా పడ్డప్పటికీ- అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్ మీద పడుకుని మరీ అక్కడే గడిపారే తప్ప వెనక్కి రాలేదు. ఇప్పుడు మరో చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని ఎంఎస్ ధోనీని చూడ్డం కోసం అని ఏకంగా బ్లాక్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు కొన్నాడు. ఈ టికెట్ల విలువ 64,000 రూపాయలు. తన కూతురి స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బులట అవి. స్కూల్ ఫీజ్ కట్టడానికి ఇంకా కొంత సమయం ఉందని, ఆ లోగా ఎలాగోలా ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చని భావించాడట.
ధోనీ ఆడే ఆటను చూడ్డానికని 64,000 రూపాయలను పెట్టి టికెట్లు కొన్నానని చెప్పాడా తమిళనాడుకు చెందిన అభిమాని. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, వాళ్లందరూ ధోనీని చూడాలని చెప్పడంతో అందరికీ బ్లాక్‌లో టికెట్లు కొన్నట్లు వివరించాడు. ఒక కూతురికి ఇంకా స్కూల్ ఫీజ్ కట్టాల్సి ఉందని తెలిపాడు.