భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మంచి ఫామ్‌లో ఉంది. మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. రికార్డులు కొల్లగొడుతొంది. కాగా, ఐసీసీ తాజాగా మహిళల క్రికెట్ వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. రెండు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాన టాప్ త్రీలో నిలిచింది. వన్డేల్లో మూడు స్థానాలు మెరుగుపడి రెండో స్థానంలో నిలవగా.. టీ20ల్లో ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకుంది.
అయితే టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక స్థానం మెరుగుపడి పదో స్థానంలో నిలవగా… వన్డేల్లో మాత్రం రెండు స్థానాలు దిగజారి 13వ స్థానానికి పడిపోయింది. ఆసీస్‌తో తొలి టీ20లో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ప్లేస్కు చేరుకుంది. షఫాలీ వర్మ 13వ స్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ ఐదు స్థానాలు దిగజారి 32వ ప్లేస్కు పడిపోయింది.