- బాలాజీ జోడీ శుభారంభం
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఐదో రోజు టాప్ సీడెడ్లు జన్నిక్ సిన్నర్, ఇగా స్వియాటెక్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఇటలీ యువ స్టార్, టాప్ సీడెడ్ జన్నిక్ సిన్నర్ 4-6, 6-4, 6-1, 6-3 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన ట్రిస్టన్ స్కూల్‌కాట్‌పై నాలుగు సెట్లలో గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు.
ఇగా స్వియాటెక్ అలవోకగా..
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్, ఆరో సీడ్ ఎలీనా రిబాకినా అలవోకగా విజయాలు సాధించారు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో పోలాండ్ స్టార్ స్వియాటెక్ 6-0, 6-2 తేడాతో స్లొవేకియాకు చెందిన రెబాకా స్రామ్‌కోవాను వరుస సెట్లలో చిత్తు చేసి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది.
రెండో రౌండ్‌లోకి బాలాజీ జోడీ..
పురుషుల విభాగం డబుల్స్‌లో శ్రీరాం బాలాజీ జోడీ శుభారంభం చేసింది. మిగతా డబుల్స్ ప్లేయర్లకు మాత్రం నిరాశే మిగిలింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో భారత స్టార్ శ్రీరాం బాలాజీ-రెయెస్ వరిలా (మాక్సికో) జోడీ 6-4, 6-3 తేడాతో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)-అలెగ్జాండర్ నెడొవిసోవ్ (కజకిస్తాన్)ను చిత్తు చేసి టోర్నీలో ముందడుగు వేశారు. ఇతర డబుల్స్ మ్యాచుల్లో భారత ద్వయం విజయ్ సుందర్ ప్రశాంత్-జీవన్.. చంద్రశేఖర్ జోడీ.. రిత్విక్ చౌదరి జంటలు తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి వైదొలిగారు.