Tuesday, November 26, 2024

World Chess | ప్ర‌పంచ చెస్‌కు సింగపూర్ ఆతిథ్యం…

న్యూఢిల్లీ: భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్, క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత దొమ్మరాజు గుకేశ్‌కు స్వదేశంలో ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా), చాలెంజర్‌ గుకేశ్‌ మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు లభించాయి.

ఈ మెగా ఈవెంట్‌ ఆతిథ్య హక్కుల కోసం అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌), తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్‌ పోటీపడ్డాయి. బిడ్‌లను పరిశీలించాక ఈ మెగా ఈవెంట్‌ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది.

ఈ ఏడాది నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 15 వరకు గుకేశ్, డింగ్‌ లిరెన్‌ మధ్య 25 లక్షల డాలర్ల (రూ. 20 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీతో ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఇద్దరి మధ్య 14 రౌండ్‌లు నిర్వహిస్తారు. తొలుత 7.5 పాయింట్లు సంపాదించిన ప్లేయర్‌ను విశ్వవిజేతగా ప్రకటిస్తారు.

14 రౌండ్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిస్తే టైబ్రేక్‌ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు క్లాసికల్‌ ఫార్మాట్‌లో భారత్‌ నుంచి విశ్వనాథన్‌ ఆనంద్‌ మాత్రమే ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆనంద్‌ ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) విశ్వవిజేతగా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement