సింగపూర్ ఓపెన్ -2022 టోర్నీలో భారత దిగ్గజ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో విజయం సాధించారు. సెకండ్ రౌండ్‌లోకి దూసుకెళ్లారు. మరో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం ప్రత్యర్థి మిథున్ మంజునాథ్ చేతిలో ఓటమిని చవిచూశాడు. బుధవారంనాడిక్కడ జరిగిన ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో వరల్డ్ నం.7 పీవీ సింధు, బెల్జియం క్రీడాకారిణి, వరల్డ్ నం.36 లియన్నె టాన్‌ను 21-15, 21-11 తేడాతో ఓడించారు. 29 నిముషాలపాటు సాగిన మ్యాచ్‌లో సింధు ఏకఛత్రాధిపత్యం సాధించింది. ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వకుండా కట్టడి చేసి, సునాయాసంగా గెలుపొందింది. ఇక సెకండ్ రౌండ్‌లో గురువారంనాడు వియత్నాం క్రీడాకారిణి వరల్డ్ నం59 థుయ్ లిన్ గుయెన్‌తో తలపడనుంది. లండన్ 2012 బ్రోంజ్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ తన ప్రత్యర్థి మాల్విక బన్సోద్‌పై 21-18, 21-14తేడాతో విజయం సాధించి, రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. అటు మాజీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్స్ పారుపల్లి కశ్యప్, ఫిప్త్ సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో 14-21, 15-21 తేడాతో ఓడిపోయాడు.
మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్, తన ప్రత్యర్థి మిధున్ మంజునాథ్ చేతిలో 21-17, 15-21, 21-18 తేడాతో ఓటమిని చవిచూశాడు. గంటపాటు సాగిన హోరీహోరీ పోరులో శ్రీకాంత్ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అశ్మిత చలిహ క్వాలిఫైర్స్ రౌండ్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి, వరల్డ్ నం.12 బసనాన్‌పై 21-16, 21-11 తేడాతో విజయం సాధించింది. థామస్ కప్ హీరో హెచ్‌ఎస్ ప్రణయ్, తన ప్రత్యర్థి థాయిలాండ్ సిత్థికం థమ్మసిన్‌పై 21-13, 21-16 తేడాతో విజయం సాదించాడు. సెకండ్ రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. వరల్డ్ నం.4 చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ)తో భారత షట్లర్, 19వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ తలపడనున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో నిథిన్ హెచ్‌వీ -ఎస్ రామ్ పూర్వీష ద్వయం ప్రత్యర్థి ఇజ్రాయెల్ జోడీ మిశా జిల్బెర్మన్- స్వెట్లానా జిబెర్మన్‌పై 21-15, 21-14 తేడాతో గెలుపొంది, సెకండ్ రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఉమెన్స్ డబుల్స్‌లో పూజ దండు- ఆర్తి సారా సునీల్ జంట కూడా సెకండ్ రౌండ్‌లోకి అడుగుపెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.