బ్యాడ్మింటన్ డబుల్స్ వరల్డ్ నంబర్ వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టికి బిగ్ షాక్ తగిలింది. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. డెన్మార్క్ ద్వయం డానియెల్ లుండ్‌గార్డ్-మ్యాడ్స్ వెస్టర్‌గార్డ్ చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసింది.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్ జోడీ పారిస్ ఒలింపిక్స్ ముంగిట తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో టైటిల్ సాధించుకోవాలని సింగపూర్ ఓపెన్‌లో మంగళవారం బరిలోకి దిగింది.
కానీ డెన్మార్క్ జంట చేతిలో 20-22, 18-21 తేడాతో ఓటమిపాలైంది. 47 నిమిషాల్లో ఈ పోరు ముగిసింది. అయితే సాత్విక్-చిరాగ్ జోడీ గొప్పగా పోరాడింది. కానీ కీలక సమయంలో తడబాటుకు గురై ప్రత్యర్థికి అవకాశాన్ని కల్పించింది. తొలి గేమ్‌లో బ్రేక్ సమయానికి 6-11తో వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత అదరగొట్టింది. 20-18తో దూసుకొచ్చింది. కానీ గేమ్‌ను విజయం సాధించలేకపోయిది. రెండో గేమ్‌లోనూ భారత జోడీ ఇదే పరిస్థితి ఎదుర్కొంది. తొలుత 3-6తో వెనుకపడింది. కానీ ఆ తర్వాత కోలుకుని 17-16తో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ మళ్లీ అదే కథ రిపీట్ అయ్యింది. ప్రత్యర్థికి అవకాశాలు ఇచ్చి మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ సీజన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్-750, థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-500 విజయం సాధించిది.
మరోవైపు సింగపూర్ ఓపెన్ తొలి రోజు భారత్‌కు కలిసిరాలేదు. పురుషుల సింగిల్స్‌ల ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. అమెరికా ప్లేయర్ లీ చెక్ చేతిలో 21-23, 19-20 తేడాతో ఓటమిపాలయ్యాడు. మహిళల సింగిల్స్‌తో ఆకర్షి కశ్యప్ కూడా పరాజయాన్ని చవిచూసింది. థాయ్‌లాండ్ క్రీడాకారిణి చోయిక్‌వాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19-21, 20-22తో ఓటమిపాలైంది. అలాగే మహిళల డబుల్స్‌తో రుతుపర్ణా-శ్వేత పర్ణా, మిక్సడ్ డబుల్స్‌లో సూర్య-అమృత తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. కాగా, ఇవాళ పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ తమ మ్యాచ్‌లను ఆడనున్నారు.