స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 26-24, 17-21, 20-22 తేడాతో ఆరో సీడ్ థాయ్ షట్లర్ సుపనిదా కెతెత్‌హొంగ్ చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు చివరి వరకు చెమటోడ్చిన ఫలితం లేకుండా పోయింది. తొలి గేమ్‌ను అతి కష్టంగా (26-24) తేడాతో గెలిచిన సింధు తర్వాత వరుసగా రెండు గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మహిళల డబుల్స్‌లో మూడో సీడ్ తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప భారత్ ద్వయం కూడా ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పొన్నప్ప జోడీ 13-21, 19-21 తేడాతో ఆరో సీడ్ లీ చియా సిన్-తెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
సెమీస్‌లో సిక్కిరెడ్డి జోడీ..
మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సిక్కిరెడ్డి-సుమీత్ రెడ్డి సెమీస్‌లో దూసుకెళ్లారు. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి-సుమీత్ జంట 14-21, 21-11, 21-17 తేడాతో ఇండోనేషియా జోడీ రెహాన్ నౌఫల్-లీసా అయు కుసుమవతిను ఓడించారు. తొలి గేమ్‌లో తడబడిన భారత జంట తర్వాత పుంజుకొని వరుసగా చివరి రెండు గేముల్లో ఇండోనేషియా జోడీని మట్టి కరిపించి టోర్నీ సెమీస్‌లో ప్రవేశించింది.