మలేషి యా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు సెమీస్‌లో దూసుకెళ్లింది. మరోవైపు యువ సంచలనం అష్మిత చాలిహా పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. గత రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 5వ సీడ్.. ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 21-13, 14-21, 21-12 తేడాతో ప్రపంచ 6వ ర్యాంకర్.. టాప్ సీడ్ హాన్ హుయి (చైనా)ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడిన సింధు తన పాత ఫామ్‌ను కనబర్చింది.
తనకంటే మెరుగైన ర్యాంకర్ క్రీడాకారిణిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో గేమ్‌లో కాస్త తడబడినా.. తొలి గేమ్‌తో పాటు నిర్ణయాత్మకమైన చివరి గేమ్‌లో దూకుడైన ప్రదర్శన కనబర్చింది. 55 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించి సెమీస్‌లో ప్రవేశించింది. ఇక్కడ జరిగిన మహిళల మరో క్వార్టర్స్ పోరులో భారత యువ స్టార్ షట్లర్ అష్మిత చాలిహా 10-21, 15-21 తేడాతో చైనాకు చెందిన ఆరో సీడ్ జాంగ్ యి మాన్ చేతిలో వరుస గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.