చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు భారీ షాక్ తగిలింది. ప్రి క్వార్టర్స్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు యువ సంచలనం లక్ష్యసేన్‌తో పాటు భారత నెం.1 పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లారు.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో తెలుగు తేజం సింధు 16-21, 21-17, 21-23 తేడాతో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో పోరాడి ఓడింది. ఫలితంగా రెండో రౌండ్‌లోనే టోర్నీ నుంచి వైదొలిగింది. మహిళల ఇతర సింగ్స్ మ్యాచ్‌ల్లో అనుపమ, మాళవిక బన్సోద్‌ల పోరాటం కూడా ప్రి క్వార్టర్స్‌లోనే ముగిసింది.
పురుషుల సింగిల్స్‌లో యువ స్టార్ లక్ష్యసేన్ జోరు కొనసాగింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 21-6, 21-18 తేడాతో డెన్మార్క్ షట్లర్ రాస్మస్ జెమ్‌కేను వరుస గేముల్లో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు.
సాత్విక్-చిరాగ్ అలవోకగా..
పురుషుల డబుల్స్‌లో మరోసారి టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-19, 21-15 తేడాతో డెన్మార్క్ జంట రాస్మస్ -ఫ్రెడరిక్ సోగార్డ్‌పై అలవోకగా విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 16-21, 11-21తో లియు షెంగ్ షు-టాన్ నింగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడి ప్రి క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు.