సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లారు. మరోవైపు ప్రియాన్షు రజావత్, తన్జీమ్ మీర్ కూడా ముందంజ వేశారు. కానీ సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, మాళవిక బన్సోద్.. డబుల్స్‌లో సుమిత్‌రెడ్డి-సిక్కి రెడ్డి జోడీకి నిరాశ ఎదురైంది. ప్రి క్వార్టర్స్‌లోనే వీరి ప్రయాణం ముగిసింది.
నేడు గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ లక్ష్యసేన్ 21-14, 21-13 తేడాతో రూస్కు చెందిన డానిల్ డుబొెవెంకోను వరుస గేముల్లో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్ లక్ష్యసేన్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
మరో సింగిల్స్‌లో రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ 21-15, 21-8 తేడాతో వియత్నాం షట్లర్ లీ డుక్ ఫాట్పై అలవోకగా విజయం సాధించాడు. వరుస స్మాష్‌లతో ప్రత్యర్థి షట్లర్‌ను హడలెత్తించిన రజావత్ కేవలం 33 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. రిత్విక్ సంజీవి సతీష్ కుమార్ కూడా చైనా ప్లేయర్ వాంగ్ జెంగ్ జింగ్ (రిటైర్డ్ హర్ట్)ను దాటేసి ముందంజ వేశాడు.
మహిళల సింగిల్స్..
భారత నెంబర్ వన్ మహిళా క్రీడాకారిణి పీవీ సింధు ప్రముఖ దేశవాళీ టోర్నీలో చెమటోడ్చి అతికష్టంగా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన తెలుగు తేజం సింధుకు యువ షట్లర్ ఇరా షర్మ గట్టి పోటీ ఇచ్చింది. గురువారం జరిగిన
మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-10, 12-21, 21-15 తేడాతో ఇరా షర్మపై మూడు గేముల్లో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.
మహిళల సింగిల్స్ మరో మ్యాచ్‌లో రెండో సీడ్ మాళవిక బన్సోద్‌కు శ్రీయాంశి వాలిశెట్టి భారీ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో శ్రీయాంశి 21-12, 21-15 తేడాతో మాళవికపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది.
మరో మ్యాచ్‌లో 6వ సీడ్ రక్షిత శ్రీ సంతోష్ రాంరాజ్ 18-21, 21-10, 16-21తో చైనాకు చెందిన వు లువో యు చేతిలో పోరాడి ఓడింది. దేవిక సింగ్ కూడా 14-21, 15-21తో చైనా షట్లర్ చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.
మరో మ్యాచ్‌లో యువ షట్లర్ తంజీమ్ మీర్ 21-15, 13-21, 21-7 తేడాతో మరో యువ స్టార్, ఐదో సీడ్ అనుపమ ఉపాద్యాయను ఓడించింది.
గాయత్రి-ట్రీసా జోడీ అలవోకగా..
మహిళల డబుల్స్‌లో భారత స్టార్ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ గాయత్రి-జాలీ జోడీ 21-13, 21-10తో భారత్‌కే చెందిన అశ్విని భట్-శిఖ గౌతమ్‌పై అలవోగా గెలిచి టోర్నీలో ముందంజ వేసింది.
మరో హహిళల డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో టాప్ సీడ్ అశ్విని పొన్నప్ప-తనీష క్రాస్టో జోడీ 21-9, 8-21, 21-12 తేడాతో చెన్ సు యు-యి యెన్ హిసియెహ్ (తైపీ) జంటను ఓడించి టోర్నీలో ముందంజ వేసింది. ఇంకో మ్యాచ్‌లో గాయత్రి రావత్-మానస రావత్ జంటకు ఓటమిపాలైంది. నాలుగో సీడ్ రుతుపర్ణ పాండా-స్వేతపర్ణ పాండా జోడీ 21-15, 21-10తో భారత్‌కే చెందిన ధన్య నందకుమార్-అరుల్ బాలా రాధకృష్ణన్పై అలవోకగా విజయం సాధించింది.
టాప్ సీడ్ జంటకు షాక్..
మిక్స్డ్ డబుల్స్‌లో టాప్ సీడ్ తెలుగు జోడీ సుమిత్ రెడ్డి-సిక్కి రెడ్డికి భారీ షాక్ తగిలింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లో సుమిత్-సిక్కి 21-19, 16-21, 13-21 తేడాతో మలేషియాకు చెందిన లూ బింగ్ కున్-హో లొ యి జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.
మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో రెండో సీడ్ సతీష్ కుమార్ కరుణకరన్-ఆధ్య వరియత్ జంట 21-18, 21-17తో చాయనిత్ జోషీ-కావ్య గుప్త జోడీపై గెలిచి నెగ్గింది. ఐదో సీడ్ ధ్రువ్ కపీల-తనిషా క్రాస్టో జోడీ 21-7, 21-13 తేడాతో భారత్‌కే చెందిన మోహిత్ జగ్లన్-లక్షిత జగ్లన్ జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది.