Thursday, January 16, 2025

India Open | క్వార్టర్‌ ఫైనల్లో సింధు..

ఇండియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత తెలుగు తేజం పీవీ సింధు 21-15, 21-13తో జపాన్‌కు చెందిన మనమి సుజుపై వరుస గేమ్‌లలో విజయం సాధించింది.

46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు జపాన్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్ నుంచి దూకుడుగా ఆడిన సింధు ఏకపక్షంగా మ్యాచ్ గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక శుక్రవారం జరిగే క్వార్టర్స్ పోరులో సింధు ఇండోనేషియాకు చెందిన జార్జియా మరిస్కాతో తలపడనుంది.

- Advertisement -

నాకౌట్‌కు సాత్విక్‌-చిరాగ్‌ జోడీ..

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ నాకౌట్‌కు అర్హత సాధించింది. కిరణ్ జార్జ్ ప్రీ-క్వార్టర్స్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ షట్లర్ అలెక్స్ లానియర్‌పై జార్జ్ 22-20, 21-13తో నెగ్గి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా నాకౌట్ దశకు చేరుకున్నారు. ఏడో సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ 20-22, 21-14, 21-16తో జపాన్‌కు చెందిన కెన్యా మిత్సుహాషి-హిరోకి ఒకమురా జోడీని ఓడించింది. తొలి గేమ్‌లో తడబడిన సాత్విక్ జోడీ అద్భుతంగా పుంజుకుని ఆ తరువాత వరుసగా రెండు గేమ్‌లు గెలిచి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.

వీరికి నిరాశే !

మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో యువ షట్లర్ అనుక్పమ ఉపాధ్యాయ 6-21, 9-21తో ప్రపంచ 11వ ర్యాంకర్ జపాన్‌కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మరోవైపు మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్‌ అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జోడీ 9-21, 21-23 తేడాతో ఫకుషిమా-మత్సుమోటో జపాన్‌ జోడీపై పోరాడి ఓడారు. ఇంకో మ్యాచ్‌లో అశ్విని భట్‌-శిఖా గౌతమ్‌ జోడీ కూడా ఓటమిపాలైంది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జోడీ 18-21, 17-21తో జపాన్‌కు చెందిన 8వ సీడ్‌ మిడొరికవా-నాత్సు సయిటో జంటపై ఓడి ప్రి క్వార్టర్స్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement