భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు జర్మన్ ఓపెన్ 2022లో చుక్కెదురైంది. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు సూపర్ 300 టోర్నీ రెండో రౌండులోనే నిష్క్రమించింది. ర్యాంకింగ్స్‌లో తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న చైనాకు చెందిన జాంగ్ ఇ మాన్ చేతిలో పరాజయం పాలైంది. మూడుసెట్ల ఈ మ్యాచ్‌లో ఏడో సీడ్ సింధు 14-21, 21-15, 14-21 తేడాతో జాంగ్ ఇ మాన్ చేతిలో ఓడిపోయింది. 55నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధును ఓడించిన జాంగ్ మూడో రౌండుకు చేరుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన జాంగ్ చివరివరకు అదే జోరును కొనసాగించి విజేతగా నిలిచింది. తొలి సెట్ ఆరంభంలో సింధు-జాంగ్ 5-5తో సమంగా ఉండగా అనంతరం జాంగ్ అనూహ్యంగా విజృంభించింది.
వరుసగా 6పాయింట్లు సాధించి 11-5తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. చివరకు 21-14తో తొలిసెట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో సెట్లో పుంజుకున్న సింధు 11-10తేడాతో ఆధిక్యంలో నిలిచి అనంతరం రెండో సెట్‌ను 21-15తో కైవసం చేసుకుంది. దీంతో ఇరువురూ చెరో సెట్ గెలుచుకోవడంతో మ్యాచ్ ఫలితం మూడో సెట్‌కు దారి తీసింది. నిర్ణయాత్మక మూడో సెట్లో చైనా క్రీడాకారిణి జాంగ్ పైచేయి సాధించింది. సింధుపై11-8 ఆధిక్యాన్ని సాధించిన జాంగ్ అదేజోరుతో మూడో సెట్‌ను 21-14తేడాతో గెలుచుకుని విజయం సాధించింది. ఈ ఓటమితో భారీ అంచనాలతో జర్మన్ ఓపెన్‌లోకి అడుగుపెట్టిన సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది.