బాకు(అజర్‌బైజాన్): షూటింగ్ ప్రపంచకప్‌లో అంజుం మౌద్గిల్ రజతంతో సత్తాచాటింది. అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల వ్యక్తిగత 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో ఆమె రజతం సొంతం చేసుకుంది. స్వర్ణ పతక పోరులో అంజుం 12-16తో రికీ మెంగ్ ఇబ్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. క్వాలిఫయింగ్ స్టేజ్-1లో 587 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి స్టేజ్-2కు అర్హత సాధించిన అంజుం.. స్టేజ్-2లో 406.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. తుది సమరంలోనూ గట్టిగానే పోరాడినా ఆమెకు రజతమే దక్కింది.
పురుషుల టీమ్ త్రిపొజిషన్స్‌లో స్వప్నిల్, దీపక్ కుమార్, గోల్డి గుర్జార్‌తో కూడిన భారత జట్టు రజతం సాధించింది. పసిడి పోరులో భారత్ 7-17తో క్రొయేషియా చేతిలో ఓడింది. మహిళల త్రిపొజిషన్స్‌లో అంజుం – ఆయూషిలతో కూడిన భారత జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో 1316 పాయింట్లతో రెండో రౌండ్ చేరిన భారత్.. ఆ తర్వాత ముందంజ వేయలేక పోయింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక స్వర్ణం, మూడు రజతాలతో భారత్ మూడో స్థానంలో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.