Sunday, November 17, 2024

Shooter | అభినవ్ బింద్రాకు అరుదైన గౌర‌వం..

భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అత్యున్నత గౌరవ ‘ఒలింపిక్ ఆర్డర్’ అవార్డు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవియా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. అగస్ట్ 10న ప్యారిస్‌లో 142వ ఐవోసీ సెషన్‌లో ఈ అవార్డును బింద్రాకు ప్రదానం చేయనున్నారు.

ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అనేది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి అందించే అత్యున్నత పురస్కారం. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయుడు అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలిచారు. 2006లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో స్వర్ణం, 2002, 2006, 2010 కామన్వెల్త్ గేమ్‌లలో పెయిర్ ఈవెంట్‌లో బంగారు పతకాలు గెలుచుకున్నాడు.

2014లో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచాడు. ఆసియా క్రీడల్లోనూ బింద్రా రజతం, కాంస్య పతకాలు సాధించాడు. 2010 ఆసియా గేమ్స్‌లో రజతం సాధించిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టులో సభ్యుడు. 2014 ఆసియా క్రీడలలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడు. 2014 ఆసియా క్రీడల్లో కూడా బింద్రా వ్యక్తిగత కాంస్యాన్ని గెలుచుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement