Saturday, November 23, 2024

Ranji 2024 | శార్దుల్‌ మెరుపు శతకం..

స్టార్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకుర్‌ అద్భుతమైన శతకంతో దూసుకెళ్లడంతో తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబై భారీ ఆధిక్యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు ప్రత్యర్థి బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఆదివారం ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది.

ప్రస్తుతం ముంబై 207 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దుల్‌ ఠాకుర్‌ (109; 105 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో రికార్డు శతకాన్ని సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఠాకుర్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. మరోవైపు 10వ నెంబర్‌ బ్యాటర్‌ తనుష్‌ కోటీయన్‌ (74 బ్యాటింగ్‌; 109 బంతుల్లో 10 ఫోర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కోటీయన్‌తో పాటు తుషార్‌ దేశ్‌పాండు (17 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. తమిళనాడు కెప్టెన్‌ సాయి కిషోర్‌ (6/97) మెరుగైన ప్రదర్శన చేశాడు.

- Advertisement -

తేలిపోయిన శ్రేయస్‌ అయ్యర్‌..

ఆదివారం రెండో రోజు ఓవర్‌నైట్‌ 45/2 స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభం కలిసిరాలేదు. మరో 3 పరుగులు జోడించిన అనంతరం ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ మోహిత్‌ ఆవస్తీ (2) పరుగులకే కిషోర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత కెప్టెన్‌ అజింక్యా రహానేతో కలిసి మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. అయితే కుదురుగా ఆడుతున్న ముంబై సారథి రహానే (67 బంతుల్లో 19)ను తమిళనాడు కెప్టెన్‌ సాయికిషోర్‌ తెలివైన బంతితో ఔట్‌ చేశాడు.

దీంతో ముంబై 91 స్కోరు వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి అడుగుపెట్టిన స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రీ ఎంట్రీతో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిన అయ్యర్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. 8 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్‌ కేవలం 3 పరుగులే చేసి క్లీన్‌ బౌల్డయ్యాడు. మరోవైపు హాఫ్‌ సెంచరీ సాధించిన యువ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ (55) కూడా కిషోర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ వెంటనే షమ్స్‌ ములానీ (0)ను కూడా ఔట్‌ చేసిన సాయి ముంబైకి కోలుకోలేని దేబ్బతీశాడు. ఇతని ధాటికి ముంబై 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.

శతకొట్టిన ఠాకుర్‌..

ఈ దశలో హార్దిక్‌ తమోర్‌, శార్దుల్‌ ఠాకుర్‌ ముంబై ఇన్నింగ్స్‌ను చక్క దిద్దారు. ఓవైపు హార్దిక్‌ సమన్వయంతో ఆడుతుంటే మరోవైపు ఠాకుర్‌ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అయితే వీరిద్దరూ 8వ వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చిన అనంతరం తమోర్‌ (92 బంతుల్లో 35)ను కూడా కిషోర్‌ పెవిలియన్‌ దారి చూపించాడు. అయితే ఈ సమయంలో 10వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తనుష్‌ కోటీయన్‌తో కలిసి 9వ నెంబర్‌ బ్యాటర్‌ శార్దుల్‌ ఠాకుర్‌ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

చెలరేగి ఆడిన శార్దుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలి సెంచరీ సాధించాడు. అనంతరం 105 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులతో వన్డే తరహలో బ్యాటింగ్‌ చేసిన శార్దుల్‌ ఠాకుర్‌ చివరికి సేన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత తనుష్‌ (74 బ్యాటింగ్‌), తుషార్‌ (17 బ్యాటింగ్‌) అజేయంగా నిలవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 353/9 స్కోరు నమోదు చేసింది. తమిళనాడు బౌలర్లలో సాయి కిషోర్‌ 6 వికెట్లతో విజృంభించగా.. కుల్దిdప్‌ సేన్‌కు రెండు వికెట్లు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement