స్కాట్లాండ్ ఉమెన్స్ టీమ్ సంచలనం సృష్టించింది. తొలిసారి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ అమ్మాయిలు 8 వికెట్లతో ఘన విజయం సాధించారు. దాంతో ఫైనల్లో ప్రవేశించిన స్కాట్లాండ్ నేరుగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.
ఇక్కడ జరిగిన సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ అమ్మాయిలు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేశారు. స్కాట్ బౌలర్ కెథారీన్ బ్రైస్ 4 వికెట్లతో విజృంభించగా.. స్లాటర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్ మేగన్ మాక్-కోల్ (50), కెప్టెన్ కాథీరిన్ బ్రైస్ (35 నాటౌట్) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కెథారీన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.