ఐపీఎల్ 2024 సీజన్‌లో నమోదవుతున్న భారీ స్కోర్లపై టీమిండియా వెటరన్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. బ్యాటర్ల హవా నడుస్తున్న టోర్నీలో బౌలర్లను రక్షించాలని కోరాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 523 పరుగులు నమోదయ్యాయి.
టీ20 చరిత్రలోనే 261 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్‌లో నమోదైన స్కోర్లపై రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చాడు. ‘ఎవరైనా బౌలర్లను కాపాడండి’అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు మరో భారత స్పిన్నర్, రాజస్థార్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఆ దేవుడే కాపాడాలన్నా’అంటూ దేవుడికి దండం పెడుతున్న ఏమోజీని షేర్ చేశాడు..
260 ప్లస్ లక్ష్యచేధనలో చివరి రెండు ఓవర్లలో బంతికి ఒక పరుగుగా సమీకరణం మారడం ఏంటోనని అశ్విన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో ఉన్న బౌండరీల సైజ్ సాధారణమేనని ఓ కామెంట్ చేసిన కామెంట్‌పై కూడా అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. నవ్వుతున్న ఏమోజీలను షేర్ చేశాడు.