- ముగిసిన సింధు, జార్జ్ పోరాటం
ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ 21-10, 21-17 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన జిన్ యాంగ్-కాంగ్ మిన్ హ్యూక్ జంటను వరుస గేముల్లో చిత్తు చేశారు. ఇక రేపు (శనివారం) జరిగే సెమీస్ పోరులో వీరు ప్రపంచ మూడో ర్యాంకర్స్ అయిన మలేషియా స్టార్ జంట గోహ్ జీ ఫీ- నూర్ ఇజుద్దీన్‌లతో తలపడనున్నారు.
సింధుకు మళ్లి నిరాశే..
మరోవైపు సింగిల్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన పివి సింధు, కిరణ్ జార్జ్ పోరు క్వార్టర్స్ లోనే ముగిసింది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ హోరాహోరీ క్వార్టర్ ఫైనల్లో సింధు 9-21, 21-19, 17-21 తేడాతో నాలుగో సీడ్ జార్జియా మారిస్క టున్‌జుంగ్ (ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడింది.
ఇక పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 13-21, 19-21 తేడాతో చైనాకు చెందిన వెంగ్ హొంగ్ యంగ్ చేతిలో ఓడి క్వార్టర్స్‌లో తన పోరాటాన్ని ముగించాడు.