చైనా ఓపెన్ బ్యాట్మింటన్ సూపర్-1000 టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ నుంచి హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, రాజవత్‌లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ ద్వయం తొలి మ్యాచ్‌లోనే ఇంటి బాట పట్టారు. ఇప్పుడు తాజాగా పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు సైతం తొలి రౌండ్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు.
బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సాత్విక్-చిరాగ్ ద్వయం 17-21, 21-11, 17-21 తేడాతో మలేసియాకు చెందిన మహ్మద్ శోహిబుల్ ఫిక్రీ-మౌలానా బాగస్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. రెండో గేమ్‌లో గెలిచి మ్యాచ్‌లో నిలిచిన భారత జంట మూడో రౌండ్‌లో మాత్రం మరోసారి తడబడింది.
దీంతో చివర్లో పుంజుకున్న మలేసియా ద్వయం భారీ స్మాష్‌లతో భారత జోడీపై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ ద్వయం 15-21, 16-21 తేడాతో మలేసియాకే చెందిన చెన్ టాంగ్ జీ-తో యి వీయ్ చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి వైదొలిగారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పర్వాలేదనిపించిన భారత షట్లర్లు చైనా ఓపెన్‌లో మాత్రం నిరాశ పరిచారు.