Monday, November 25, 2024

నేడే సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్…

భారత టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సానియా ఆదివారం హైదరాబాద్‌లో చివరిసారి రాకెట్‌తో బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు కలిసి ఆడిన రోహన్‌ బోపన్న, ఇవాన్‌ డోడిగ్‌, బెతానీ మాటెక్‌ సాండ్స్‌, కారా బ్లాక్‌, మరియన్‌ బర్తోలీతో కలిసి నేడు ఎల్బీ టెన్నిస్‌ స్టేడియంలో సానియా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడనుంది. దుబాయ్‌లో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీ ద్వారా రిటైర్‌ అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన సానియా తన అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ‘కెరీర్‌లో నేను ఊహించిన దాని కంటే ఎక్కువ సాధించాను. కోర్టులో గడిపిన ప్రతీ క్షణం మరిచిపోలేనిది. ఒలింపిక్స్‌లో పతకం గెలువకపోవడం నా కెరీర్‌లో తీరని లోటు. నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో సొంత అభిమానుల మధ్య ఆడి కృతజ్ఞతలు తెలుపాలనుకుంటున్నాను. ఎక్కడ మొదలు పెట్టానో తిరిగి అక్కడికే రావడం గొప్పగా అనిపిస్తున్నది’ అని సానియా పేర్కొంది. ఇదిలా ఉంటే జూనియర్‌ వింబుల్డన్‌ టైటిల్‌ గెలువడం జీవితంలో మరిచిపోలేని సందర్భమని సానియా గుర్తుకు తెచ్చుకుంది. హైదరాబాద్‌లో తనకు లభించిన స్వాగతం జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది. త‌న రిటైర్మెంట్ త‌ర్వాత యువ క్రీడాకారుల‌కు శిక్ష‌ణ ఇస్తాన‌ని పేర్కొంది.. ఇక ఎక్కువ స‌మ‌యం త‌న కుమారుడితో గ‌డుపుతాన‌ని వెల్ల‌డించింది..త‌న ఎదుగుద‌ల‌లో స‌హ‌కరించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కోచ్ ల‌కు, స‌హ‌చ‌ర క్రీడాకారుల‌కు, స్పాన్స‌ర్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement