స్వియాటెక్‌కు షాకిచ్చిన కీస్
ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంకా, 19వ సీడ్ మాడిసన్ కీస్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బెలారస్ భామ అరీనా సబలెంకా 6-4, 6-2 తేడాతో 11వ సీడ్ పౌలా బడోసాను వరుస సెట్లలో చిత్తు చేసి అలవోకగా ఫైనల్లోకి దూసుకెళ్లింది.
హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన టాప్ సీడ్ సబలెంకా వరుసగా మూడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో అమెరికా స్టార్ మాడిసన్ కీస్‌తో సబెలంకా తలపడనుంది.
స్వియాటెక్‌కు షాక్.. ఫైనల్లో మాడిసన్ కీస్
మరో మహిళల సింగిల్స్ సెమీస్ పోరులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్.. పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్‌కు ఊహించని షాక్ తగిలింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో అమెరికా స్టార్ సీనియర్ క్రీడాకారిణి మాడిసన్ కీస్ 5-7, 6-1, 7-6 (10-8) తేడాతో మాజీ వరల్డ్ నెం.1 స్వియాటెక్‌పై సంచలన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.
రేపు పురుషుల సింగిల్స్ పోరు..
మరోవైపు శుక్రవారం పురుషుల సింగిల్స్ సెమీస్ సమరం జరగనుంది. తొలి సెమీస్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత నొవాక్ జకోవిచ్ (సెర్బియా)తో ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఢీ కొననున్నాడు. రెండో సెమీ ఫైనల్లో వరల్డ్ నెంబర్-1 జన్నిక్ సిన్నర్ (ఇటలీ)తో 21వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) అమీతుమీ తేల్చుకోనున్నాడు.