- జకోవిచ్, జ్వెరెవ్, కోకో గాఫ్, పెగుల ముందంజ
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ అరీనా సబలెంకా, కార్లోస్ అల్కరాజ్ నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించారు. మరోవైపు 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత నొవాక్ జకోవిచ్‌తో పాటు రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మూడో సీడ్ కోకో గాఫ్, ఏడో సీడ్ జెస్సిక పెగులా కూడా టోర్నీలో ముందంజ వేశారు.
ఈరోజు శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో ప్రపంచ నెంబర్-1.. బెలారస్ భామ అరీనా సబలెంకా 7-6 (7-5), 6-4 తేడాతో కార్లా టౌసన్ (డెన్మార్క్)పై చెమటోడ్చి నెగ్గింది. దీంతో నాలుగో రౌండ్‌కు అర్హత సాధించింది.
మరో మ్యాచ్‌లో అమెరికా నయా తారా మూడో సీడ్ కోకో గాఫ్ 6-4, 6-2 తేడాతో లెలా ఫెర్నాండేజ్ (కెనడా)ను వరుస సెట్లలో చిత్తు చేసింది.
మరో అమెరికా స్టార్ ఏడో సీడ్ జెస్సికా పెగులా 7-6 (7-3), 6-1తో ఓల్గా డానిలోవిక్ (సెర్బియా)పై కష్టపడి నెగ్గింది. ఇతర మ్యాచుల్లో 14వ సీడ్ మీర్రా ఆండ్రివా (రష్యా) 6-2, 1-6, 6-2తో మాగ్‌డలెనా ఫ్రెచ్ (పోలాండ్)పై, 11వ సీడ్ పౌలా బడోసా (స్పెయిన్) 6-4, 4-6, 6-3తో 17వ సీడ్ మార్ట కొస్టియుక్ (ఉక్రెయిన్‌పై గెలిచి టోర్నీలో ముందంజ వేశారు.
జకోవిచ్ అలవోకగా..
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో ఏడో సీడ్ సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ 6-1, 6-4, 6-4 తేడాతో టోమస్ మాచ (చేచియా)పై అలవోకగా విజయం సాధించాడు.
మరో మ్యాచ్‌లో జర్మనీ స్టార్ రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-3, 6-4, 6-4తో యూకే ప్లేయర్ జాకబ్ ఫీయర్న్‌లీను వరుస సెట్లలో చిత్తు చేసి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టాడు.
కాగా, డిఫెండింగ్ ఛాంప్, మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6-2, 6-4, 6-7 (3-7), 6-2తో నునో బొర్గెస్ (పోర్చుగల్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇతర మ్యాచుల్లో 12వ సీడ్ టామా పాల్, 15వ సీడ్ జాక్ డ్రాపర్ (యూకే), 14వ సీడ్ యుగో హంబర్ట్ తర్వాతి రౌండ్స్‌కు అర్హత సాధించారు.