Sunday, November 24, 2024

CSK : రుతురాజ్ మ‌రో ఘ‌న‌త‌… ప్ర‌స్తుతం ఆరంజె క్యాప్ హోల్డ‌ర్

స్వంతమైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నైకి ఇది మూడో ఓటమి కావడం గమనార్హం.

- Advertisement -

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62; 48 బంతుల్లో; 5×4, 2×6) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. రొసో (43; 23 బంతుల్లో, 5×4, 2×6), బెయిర్‌స్టో (46; 30 బంతుల్లో, 7×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

కాగా, ఈ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన రుతురాజ్ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. పది మ్యాచ్‌ల్లో 63 సగటుతో 509 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ క్రమంలో అతను అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 500+ స్కోరు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి కెప్టెన్‌గా రుతురాజ్ రికార్డులకెక్కాడు.
ఈ సీజన్‌లో సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయిదు టైటిళ్లు గెలిచిన ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ జట్టు పగ్గాలను అందుకున్నాడు. అంచనాలను అందుకుంటూ కెప్టెన్‌, బ్యాటర్‌గా నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు. కాగా, సీజన్ ఫస్ట్ హాఫ్‌లో సత్తాచాటిన సీఎస్కే సెకండ్ హాఫ్‌లో తడబడుతోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్‌ కోసం సీఎస్కే తీవ్ర పోటీ ఎదుర్కొంటుంది.పది మ్యాచ్‌లు ఆడిన చెన్నై అయిదు విజయాలతో పది పాయింట్లు సాధించింది. మరోవైపు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, పది మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పది పాయింట్లతో అయిదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement