ఒలింపిక్స్‌లో ఒకప్పుడు రష్యాది తిరుగులేని ఆధిపత్యం. ఆ దేశం నుంచి వందల మంది అథ్లెట్లు బరిలోకి దిగేవారు. పతకాలూ పెద్ద ఎత్తున కొల్లగొట్టేవాళ్లు. అగ్ర స్థానం కోసం అమెరికాతో సై అంటే సై అంటూ ఢీకొట్టేది ఆ దేశం. అలాంటిది ఇప్పుడు రష్యా నుంచి కేవలం 15 మంది అథ్లెట్లు మాత్రమే పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ 15 మంది పేర్ల వెనుక కూడా రష్యా ఉండదు. తటస్థ అథ్లెట్లుగానే పోటీ పడబోతున్నారు. తమ దేశ జెండా చేబూనే అవకాశం వారికి లేదు. రష్యా అథ్లెట్లు పతకం గెలిచినా ఆ దేశ జాతీయ గీతం వినిపించదు.
డోపింగ్ కుంభకోణం కారణంగా 2020 ఒలింపిక్స్‌లోనూ రష్యా క్రీడాకారులు తమ దేశపు జెండా లేకుండానే పోటీ పడ్డారు. కానీ అప్పుడు పూర్తి స్థాయి జట్లే బరిలోకి దిగాయి. టోక్యోలో 330 మంది రష్యా అథ్లెట్లు పోటీ పడితే… 20 స్వర్ణాలు సహా 71 పతకాలు సాధించారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నం. ఉక్రెయిన్‌పై రెండేళ్లుగా యుద్ధం చేస్తుండడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రష్యాపై నిషేధం విధించడమే కాక.. ఆ దేశ అథ్లెట్లు పారిస్‌లో పోటీ పడాలంటే కొన్ని షరతులు పెట్టింది.
అథ్లెట్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ప్రకటించి ఉండకూడదు. సైన్యంతో ఒప్పందం కలిగి ఉండకూడదు. వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడే క్రీడాకారులకు మాత్రమే అవకాశం. జట్లకు ఛాన్స్ లేదు. వీటిని అనుసరించే రష్యా క్రీడాకారులకు ఐఓసీ ఆహ్వానాలు పంపింది.
అయితే వందల మంది రష్యా అథ్లెట్లు దేశం వైపు నిలిచి స్వచ్ఛందంగానే ఒలింపిక్స్‌ను బహిష్కరించారు. మెద్వెదెవ్, ఆంద్రీవా సహా ఏడుగురు టెన్నిస్ క్రీడాకారులు, ఇంకో 8 మంది ఇతర క్రీడల అథ్లెట్లు మాత్రం ఈ షరతులకు లోబడి ఒలింపిక్స్ బరిలో నిలిచారు. వీరిపై స్వదేశంలో దేశ ద్రోహులుగా ముద్ర పడింది. రష్యాలో ఏ టీవీ ఛానెల్ కూడా ఒలింపిక్స్‌ను ప్రసారం చేయట్లేదు. దీంతో పారిస్‌లో పోటీ పడే రష్యా అథ్లెట్లు అనాథల్లా మారినట్లయింది.