- జమ్మూ కశ్మీర్ మ్యాచ్ లో మూడు పరుగులకే ఔట్
- యశస్వీ జైశ్వాల్ సైతం విఫలం
- పీకల్లోతు కష్టాల్లో ముంబై
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. పదేళ్ల తర్వాత రంజీట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ అక్కడ కూడా తీవ్ర నిరాశపరిచాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో హిట్ మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ ఆరంభం నుంచే జమ్మూ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు.
ఆఖరికి 19 బంతులు ఆడి పేసర్ ఉమార్ నజీర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అతడితో పాటు మరో స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ సైతం విఫలమయ్యాడు. జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అకిబ్ నబీబ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబై కేవలం 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్, జైశ్వాల్ తో పాటు కెప్టెన్ అజింక్య రహానే, హార్డిక్ తోమార్, శివమ్ దూబే వంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్ కు చేరారు. జమ్మూ బౌలర్ ఉమార్ నజీర్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు.
తీరు మారని రోహిత్..
కాగా రోహిత్ శర్మ రెడ్ బాల్ ఫార్మాట్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 ఇన్నింగ్స్ లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రంజీలో ఫామ్ పొందేందుకు బరిలో దిగినా తీరు మాత్రం మారలేదు..