Tuesday, November 26, 2024

Breaking | గాయంతోనూ రోహిత్ శర్మ పోరాటం… 5 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా ఓటమి

బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా గెలవలేకపోయింది. 272 పరుగుల టార్గెట్​ ఛేదించే క్రమంలో 5 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. బొటనవేలి గాయంతో చివర్లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత పోరాటం వృథాగానే మిగిలింది. రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసి చివరి దాకా క్రీజులో నిలిచాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఆఖర్లో 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, ముస్తాఫిజూర్ రెహ్మాన్ విసిరిన ఆ ఓవర్లో రోహిత్ శర్మ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి క్రికెట్​ అభిమానుల్లో ఆశలు కల్పించాడు. చివరి బంతికి సిక్స్ కొడితే విజయం దక్కుతుందనగా, ముస్తాఫిజూర్ యార్కర్ వేయడంతో రోహిత్ భారీ షాట్ కొట్టేందుకు సాధ్యం కాలేదు. దీంతో టీమిండియా స్కోరు 266 పరుగుల వద్ద నిలిచిపోయింది.

టీమిండియా స్కోర్ కార్డ్ చూస్తే… రోహిత్ శర్మ గాయం కారణంగా ఆసుపత్రికి వెళ్లడంతో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలో దిగాడు. అయితే 5 పరుగులకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (8) సైతం విఫలం కావడంతో టీమిండియా 13 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 11, కేఎల్ రాహుల్ 14 పరుగులకే వెనుదిరగడంతో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయి. వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 6 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (56) అర్ధసెంచరీతో రాణించాడు. అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతసేపు టీమిండియా ఇన్నింగ్స్ సజావుగానే సాగింది. వీరిద్దరూ అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

గాయం కారణంగా చివర్లో బ్యాటింగ్ కు దిగిన రోహిత్ ఎడాపెడా బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అప్పటికే 9 వికెట్లు పడిపోయినా రోహిత్ పోరాటం ఆపలేదు. కానీ ఇన్నింగ్స్ చివరిబంతిని ముస్తాఫిజూర్ తెలివిగా యార్కర్ వేయడంతో రోహిత్ సిక్స్ కొట్టేందుకు విఫలయత్నం చేశాడు. కాగా, ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-0తో గెలుచుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య మూడో వన్డే నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్ డిసెంబరు 10వ తేదీ చట్టోగ్రామ్ లో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement