వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 ప్రపంకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా సమరం కోసం ఈ నెలఖారులోగా ఆయా దేశాలు తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ఆధారంగా టీమిండియా ప్లేయర్ల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈసారి ఓపెనర్ రోహిత్ శర్మతో రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ జత కట్టనున్నాడని సమాచారం.
ఇందుకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మతో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచుల్లో 361 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అందుకే ఈసారి రోహిత్‌కు జోడీగా యువ ఆటగాళ్లకి బదులుగా కోహ్లీని ఆడించాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు ఇప్పటికే 20 మందిని ఎంపిక చేశారని ఓ ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. వారిలో 15 మంది రెగ్యులర్ సభ్యులు ఉండగా.. మిగతా ఐదుగురు స్టాండ్ బైలుగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. కానీ ప్రపంచకప్ జట్టుపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.