Saturday, November 23, 2024

Record | టీ20ల్లో రియాన్‌ పరాగ్‌ కొత్త చరిత్ర.. వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలతో సంచలనం

ఐపీఎల్‌ యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే రియాన్‌ పరాగ్‌ దేశావాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20లో అస్సాం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో చెలరేగి బ్యాటింగ్‌ చేస్తున్న పరాగ్‌ కొత్త హిస్టరీని క్రియేట్‌ చేశాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా కొత్త వరల్డ్‌ రికార్డును నమోదు చేశాడు. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లకు సాధ్యం కాని కొత్త రికార్డును యువ బ్యాటర్‌ పరాగ్‌ సాధించి సంచలనం సృష్టించాడు. శుక్రవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో అస్సాం 2 వికెట్లతో కేరళను ఓడించింది. ఈ టోర్నీలో కేరళ తొలి ఓటమి రుచి చూసింది. గ్రూప్‌-బిలో కేరళ 7 మ్యాచుల్లో 6 గెలిచి అగ్ర స్థానంలో ఉంది.

- Advertisement -

ఇక ఈ మ్యాచ్‌లో అస్సాం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది. ఓపెనర్‌ రోహన్‌ కున్నుమల్‌ (31; 32 బంతుల్లో 2 ఫోర్లు) పర్వాలేదనిపించినా.. చివర్లో అబ్దుల్‌ బాసిత్‌ (46 నాటౌట్‌; 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), సచిన్‌ బేబి (18 నాటౌట్‌) దూకుడుగా ఆడటంతో కేరళ ఆమాత్రం స్కోరును సాధించగలిగింది.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అస్సాం బ్యాటర్లు కూడా తడబాటుకు గురయ్యారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోతూ ఓటమి అంచుల్లో పడిపోయారు. ఈ సమయంలో అస్సాం సారథి రియాన్‌ పరాగ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో తమ జట్టును ఆదుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి వరుసగా వికెట్‌లు పడుతున్నా తాను మాత్రం నిలకడగా రాణిస్తూ సిక్సర్లతో విజృంభించాడు.

ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పరాగ్‌ ఆఖర్లో అజేయంగా ఉండి తమ జట్టును మరో మూడు బంతులు మిగిలుండగానే విజయ తీరాలకు చేర్చాడు. దీంతో అస్సాం 19.3 ఓవర్లలో (130/8) స్కోరుతో లక్ష్యాన్ని చేదించింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన రియాన్‌ పరాగ్‌ ( 57 నాటౌట్‌; 33 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లు) టీ20ల్లో వరుసగా ఆరో హాఫ్‌ సెంచరీ నమోదు చేసి కొత్త చరిత్ర లిఖించుకున్నాడు.

పరాగ్‌ ఈ టోర్నీలో వరుసగా (61, 76 నాటౌట్‌, 53 నాటౌట్‌, 76, 72, 57 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఈ టోర్నీకి ముందు దియోదర్‌ ట్రోఫీలోనూ రియాన్‌ పరాగ్‌ 102 నాటౌట్‌, 95 పరుగులు చేశాడు. వరుస మ్యాచుల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణిస్తూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement