రీ ఎంట్రీలో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో 3వేల పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ రికార్డును అందుకున్నాడు. కాగా..ఈ మ్యాచ్‌లో పంత్ 24 బంతుల్లో 41 పరుగులు సాధించాడు.
శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లిలు మాత్రమే పంత్ కన్నా తక్కువ వయసులో 3వేల పరుగులు సాధించిన జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 26 ఏళ్ల 191 రోజుల వయసులో పంత్ ఈ ఘనతను అందుకోగా శుబ్‌మన్ గిల్ 24 ఏళ్ల 215 రోజులు, విరాట్ కోహ్లి 26 ఏళ్ల 186 రోజుల తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా.. ఐపీఎల్‌లో మూడు వేల పరుగులు కంటే ఎక్కువగా పరుగులు చేసిన 25 మంది బ్యాటర్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ (151.68), క్రిస్ గేల్ (148.96) తరువాత అత్యధిక స్ట్రైక్ రేటు పంత్ (148.4 )దే కావడం గమనార్హం.
అతి పిన్న వయసులో ఐపీఎల్‌లో 3వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..
శుభ్‌మన్ గిల్ – 24 ఏళ్ల 215 రోజులు
విరాట్ కోహ్లీ – 26 ఏళ్ల 186 రోజులు
రిషబ్ పంత్ – 26 ఏళ్ల 191 రోజులు
సంజు శాంసన్ – 26 ఏళ్ల 320 రోజులు
సురేష్ రైనా – 27 ఏళ్ల 161 రోజులు