బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషభ్ పంత్.. బౌలర్లకు కావాల్సిన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయామని తెలిపాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడాన్ని కూడా సమర్థించుకున్నాడు.
‘ముందు బ్యాటింగ్ చేయడం చాలా మంచి ఆప్షన్. అయితే బ్యాటింగ్ యూనిట్‌గా మేం దారుణంగా విఫలమయ్యాం. 150 పరుగుల లక్ష్యం చాలా తక్కువ. అయితే మా తప్పిదాల నుంచి మేం పాఠాలు నేర్చుకుంటాం. ప్రతీ రోజు మనది కాదు. మేం ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 5 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలవాలి. సమష్టి ప్రదర్శనతో ఈ సవాల్‌ను అధిగమిస్తాం. అయితే ఈ పిచ్‌పై మేం 180-200 పరుగులు చేస్తే ఫలితం మరోలా ఉండేది. మా బౌలర్లకు మేం పోరాడే లక్ష్యాన్ని ఇవ్వలేకపోయాం.’అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.