టీమ్ఇండియా మాజీ ఆటగాడు, హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.
గైక్వాడ్ 1974-84 మధ్య అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు.ఆయన మొత్తం 40 టెస్టులు, 15 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 1983లో జలంధర్ లో పాకిస్థాన్ పై 201 పరుగుల అత్యధిక స్కోరు చేశాడు. అంతేకాదు.. తన వన్డే కెరీర్ లో అతను రెండు సెంచరీలతో 1154 పరుగులు చేశాడు.గైక్వాడ్ 1997-1999 మధ్య, అదేవిధంగా 2000 సంవత్సరంలో రెండు దఫాలు భారత జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేశాడు.
అతని కోచింగ్ లో భారత్ జట్టు 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోపీలో రన్నరప్ గా నిలిచింది. అతను కోచ్ గా ఉన్న సమయంలోనే అనిల్ కుంబ్లే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టెస్టు ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. గైక్వాడ్ 1990లలో జాతీయ సెలెక్టర్ గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు
71ఏళ్ల గైక్వాడ్ సుదీర్ఘకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. లండన్ లోనూ చికిత్స పొందాడు. ఈ క్రమంలో బీసీసీఐ అన్షుమాన్ గైక్వాడ్ కుటుంబానికి కోటి ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
గైక్వాడ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సహా మాజీ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. అన్షుమాన్ గైక్వాడ్ క్రికెట్కు చేసిన కృషికి గుర్తుండిపోతారు. అతను ప్రతిభావంతుడైన ఆటగాడు. అత్యుత్తమ కోచ్. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధాని సానుభూతి తెలిపారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్షుమాన్ గైక్వాడ్ మృతికి ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషాసైతం ఎక్స్ వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.