పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో టీమిండి యా 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించి వరుసగా రెండో ఒలింపిక్ మెడల్ సొంతం చేసుకుంది. తాజాగా పారిస్‌లో స్పెయిన్‌ను ఓడించి రెండో కంచును ముద్దాడింది.
ఈ మెగా టోర్నీ ఆరంభం నుంచే దూకుడైన ఆటతో భారత ఆటగాళు అదరగొట్టారు. గ్రూప్ దశలో పటిష్టమైన ఆస్ట్రేలియాను చిత్తు చేసి రికార్డు సృష్టించిన టీమిండియా రెండో స్థానంతో లీగ్ దశను ముగించింది. నాకౌట్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ షూటౌట్‌లో 4-2 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిటన్‌ను మట్టి కరిపించింది.
అనంతరం జరిగిన సెమీస్ సమరంలో అద్భుతంగా పోరాడిన టీమిండియా చివర్లో 2-3 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు కాంస్య పతకం కోసం జరిగిన చివరి పోరులో స్పెయిన్‌ను చిత్తుచేసి భారత్‌కు నాలుగో మెడల్ అందించింది. భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో పాటు ఇతర ప్రముఖులు అభినందనలు తెలిపారు.
హాకీ వీరులకు నజరానా…
వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. దీంతో ప్లేయర్లకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా అందించనుంది. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటన విడుదల చేశారు.
”కఠిన శ్రమ, నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కష్టంతో కాంస్యం దక్కింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ పతకం గెలవడం అద్భుతం. దీంతో ప్రపంచ వేదికపై భారత హాకీ పునర్జీవాన్ని ప్రతిబింబిస్తుంది. వారు సాధించిన దానికి క్యాష్ ప్రైజ్‌మనీ సరితూగదు. కానీ, ప్రోత్సాహకం ఇవ్వడం అత్యవసరం. ఆర్‌పీ శ్రీజేష్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అతడి వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది” అని దిలీప్ పేర్కొన్నారు.
ఒడిశా సీఎం కూడా..
కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి మాంఝీ, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒడిశా సీఎం హాకీ ప్లేయర్లకు రివార్డు ప్రకటించారు. తమ రాష్ట్రం తరఫున ఆటగాళ్లందరికీ రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 10 లక్షలు ఇస్తు్న్నట్లు వెల్లడించారు. అలాగే ఒడిశాకు చెందిన అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల రివార్డును ఇస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాకీ ప్లేయర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.
పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కూడా….
తమ రాష్ట్రాల తరుపున పాల్గొన్న హకీ క్రీడాకారులకు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు నగదు నజరానాలు ప్రకటించారు.. ఒక్కొ క్రీడాకారుడి కోటీ రూపాయిలు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి..