Saturday, November 23, 2024

ఇరానీ ట్రోఫీ విజేత రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా..

ఇరానీ ట్రోఫీ-2023 విజేతగా రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు నిలిచింది. రంజీ ఛాంపియన్‌ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండింయా (ఆర్‌ఓఐ) 175 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులు చేసింది. మరోవైపు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే కుప్పకూలింది.

దాంతో ఆర్‌ఓఐకి భారీ విజయం సొంతమైంది. రెస్ట్‌ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌ (72) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా బ్యాటర్లలో హనుమవిహారి (33), శ్రీకర్‌ భరత్‌ (36), సౌరభ్‌ కుమార్‌ (39), మయాంక్‌ అగర్వాల్‌ (32), షమ్స్‌ ములానీ (32) పరుగులతో పర్వాలేదనిపించడంతో ఆర్‌ఓఐ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగలిగింది. ప్రత్యర్థి బౌలర్లలో పార్థ్‌ భట్‌ 5, ధరేంద్ర జడేజా 3, యువరాజ్‌ సింగ్‌ దోడియా 2 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

అనంతరం సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్‌ వసవద (54), చతేశ్వర్‌ పుజారా (29), సమర్థ్‌ (29), ప్రేరక్‌ మన్కద్‌ (29) పరుగులు చేశారు. రెస్ట్‌ బౌలరల్లో సౌరభ్‌ కుమార్‌ 4 వికెట్లతో చెలరేగగా.. విద్వత్‌ కావేరప్ప 3 వికెట్లు తీసి సౌరాష్ట్రను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. రెస్ట్‌కు 94 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రత్యర్థి బౌలర్‌ పార్థ్‌ భట్‌ (7/53) హడలెత్తించాడు. దీంతో ఈ జట్టు 160 పరుగులకు ఆలౌటైపోయింది. అనంతరం 254 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌరాష్ట్ర 79 పరుగులకే కుప్పకూలింది. రెస్ట్‌ బౌలర్లలో స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ 6 వికెట్లుతో విజృంభించగా.. షమ్స్‌ 3, నారంగ్‌ ఒక వికెట్‌ తీసి విజయంలో తమవంతు సహకారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement