Monday, November 18, 2024

IPL ప్రసార హక్కులపై రిలయన్స్‌ వర్సెస్‌ అమెజాన్‌..

ఐపీఎల్‌ మ్యాచ్ ల ప్రసార హక్కులు దక్కించుకునేందుకు దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌, విదేశీ కంపెనీ అమెజాన్‌లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 2018 నుంచి 2022 వరకు ఐదేళ్ల కోసం ఐపీఎల్‌ మ్యాచ్ లకు సంబంధించిన ప్రసార హక్కులను స్టార్‌ ఇండియా సొంతం చేసుకుంది. ఆ సమయంలో రూ.16,347 కోట్లు చెల్లించింది. అయితే ఇక వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ప్రసార హక్కులు దక్కించుకునేందుకు రిలయన్స్‌, అమెజాన్‌తో పాటు సోనీ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వీరి పోటీ చూసి.. ఈ సారి ప్రసార హక్కుల ధర రూ.40వేల కోట్ల నుంచి రూ.50వేల కోట్ల వరకు వెళ్లే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్ లను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తుంటారు. దీనికి సంబంధించిన ప్రసార హక్కులు దక్కించుకున్న కంపెనీకి పండుగే..

వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్‌ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ.50వేల కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ సాంప్రదాయ మీడియా సంస్థలు ఇప్పుడు భారతదేశం అతిపెద్ద రిటైలర్‌ రిలయన్స్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. అమెజాన్‌, రిలయన్స్‌ ఇప్పటికే ఫ్యూచర్‌ గ్రూపు ఆస్తుల విషయంలో కోర్టు మెట్లు ఎక్కాయి. ఎలాగైనా ప్రసార హక్కులు పొందడం అనేది ఈ రెండు కంపెనీలకు ప్రెస్టీజ్‌గా తీసుకుంటున్నాయి. రిలయన్స్‌ తన బ్రాడ్‌ కాస్టింగ్‌ జాయింట్‌ వెంచర్‌ వయాకామ్‌18 కోసం 1.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సేకరించడానికి విదేశీయులతో సహా ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నది. ఈ బిడ్‌ గెలుచుకోవడం రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫారమ్‌, దాని డిజిటల్‌ విస్తరణ కోసం దీర్ఘ కాలిక ప్రణాళికలలో కీలకం అని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవల లైవ్‌ స్ట్రీమింగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రారంభించిన అమెజాన్‌ తన ప్లాట్‌ ఫాం యూజర్‌ బేస్‌ పెంచుకోవడానికి ఐపీఎల్‌ ప్రసార హక్కులను గెలుచుకోవాలని అనుకుంటున్నది. ఈ కంపెనీకి టీవీ ప్లాట్‌ఫాం లేదు. టీవీలో క్రికెట్‌ ప్రసారం కోసం మరో భాగస్వామితో చేతులు కలిపే అవకాశం ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement