Tuesday, November 26, 2024

RCB : ఆల్ టైమ్ రికార్డ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజా విసిరింది. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6) టాప్ స్కోరర్. విరాట్ కోహ్లి (47; 29 బంతుల్లో, 3X4, 4X6), రజత్ పటిదార్ (41; 23 బంతుల్లో, 2X4, 4X6), కామెరూన్ గ్రీన్ (38*; 17 బంతుల్లో, 3X4, 3X6) సత్తాచాటారు. మిచెల్ శాంట్నర్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నైని 200 పరుగులకే కట్టడి చేయాలి. కాగా, ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది.

- Advertisement -

రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6), రవీంద్ర జడేజా (42; 22 బంతుల్లో, 3X4, 3X6), అజింక్య రహానె (33; 22 బంతుల్లో, 3X4, 1X6), ఎంఎస్ ధోనీ (25; 13 బంతుల్లో, 3X4, 1X6) పోరాడారు.ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేకు చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు. కానీ యశ్ ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఖరి అయిదు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చాడు.

అయితే ప్లేఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించి, ఏడింట్లో ఓడింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసింది. కానీ చివరి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలతో హోరెత్తించి లీగ్ తదుపరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది.
తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో మరే జట్టు ఆర్సీబీలా గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్స్‌కు చేరలేదు. 2016లోనూ ఆర్సీబీ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ టీమ్‌గా చరిత్రకెక్కింది. ఆ సీజన్‌లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. కానీ చివరి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గి ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.
ఇక ఓ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా ఆరు విజయాలు, ఆరు ఓటములు చవిచూసిన ఏకైక జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు సృష్టించింది. డెక్కన్ ఛార్జర్స్ (2010), పంజాబ్ కింగ్స్ (2020), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2022) వరుసగా అయిదు విజయాలు, అయిదు ఓటములు చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement