దేశవాళీ క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ శుభమాన్ గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. కాగా గత కొంతకాలంగా భారత ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభమాన్ గిల్ తదితరులు టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలు కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరఫున.. రిషబ్ పంత్ ఢిల్లీ తరఫున.. శుభమాన్ గిల్ పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ సెకండ్ లీగ్ బరిలో దిగారు. కోహ్లి మాత్రం మెడనొప్పి వల్ల ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు.
పంజాబ్ ఓపెనర్ గిల్ విఫలం…
ఇక బెంగళూరు వేదికగా కర్ణాటక- పంజాబ్ మధ్య గురువారం మొదలైన మ్యాచ్ లో టాస్ గెలిచిన కర్ణాటక.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రభ సిమ్రన్ సింగ్ తో కలిసి శుభమన్ గిల్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి వరుస ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్ లో తొలి వికెట్ గా గిల్ వెనుదిరిగాడు.