భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణీ రాంపాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం రాణీ రాంపాల్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు సేవలు అందించిన రాణీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది.
హర్యానాకు చెందిన 29 ఏళ్ల రాణీ రాంపాల్ 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టింది. 2008లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడింది. అనంతరం అద్భుత ప్రదర్శనలు, అపార ప్రతిభతో కొద్దికాలంలోనే జాతీయ జట్టు పగ్గాలు అందుకునే స్థాయికి చేరింది.
2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ను నాలుగో స్థానంలో నిలపడంలో రాణీ కీలక పాత్ర పోషించింది. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం, 2014లో కాంస్య పతకం అందించింది. అలాగే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో గోల్డ్ మెడల్‌తో సహా మూడు పతకాలు గెలిచిన భారత జట్టులో సభ్యరాలుగా నిలిచింది.
కాగా, రాణీ రాంపాల్ తన కెరీర్‌లో 254 మ్యాచ్‌లు ఆడి మొత్తం 205 గోల్స్ కొట్టింది. భారత హాకీకి విశేష సేవలు అందించిన రాణీకు భారత ప్రభుత్వం 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. ఇక అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాణీ రాంపాల్ జాతీయ స్థాయి జూనియర్ మహిళా జట్టుకు కోచ్‌గా వ్యవహరించనుంది.