Friday, November 22, 2024

IPL: టాప్ లో రాజస్థాన్…ఆఖరి ప్లేస్ లో ఢిల్లీ

ఐపీఎల్ 17వ సీజన్ అభిమానులను అలరిస్తోంది. మంగళవారం నాటికి ఐపీఎల్‌లోని ఆరు ఫ్రాంచైజీలు ఐదేసి చొప్పున మ్యాచ్‌లు ఆడగా.. మిగతా నాలుగు ప్రాంఛైజీలు నాలుగు మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన చేయగా.. రాజస్థాన్ రాయల్స్ మాత్రమే ఓటమి ఎరగని జట్టుగా నిలిచింది.

- Advertisement -

టాప్‌లో రాజస్థాన్
ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ నాలుగింటిలోనూ గెలిచి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు నెట్ రన్‌రేట్ +1.120గా ఉంది. జోస్ బట్లర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ మంచి ఫామ్‌లో ఉండటంతో.. రాజస్థాన్ తేలిగ్గా విజయాలు సాధిస్తోంది.

కోల్‌కతాకు రెండో స్థానం
ఐపీఎల్ 2024లో మంచి ఊపు మీదున్న మరో జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఈ జట్టు.. విశాఖ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యా్చ్‌లో 272 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్ నమోదు చేసింది. అయితే చెపాక్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా కోల్‌కతా ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది. అయినా సరే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

మూడో స్థానంలో లక్నో..
ఈ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తోన్న జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిన రాహుల్ సేన.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ లక్నో ముందుగా బ్యాటింగ్ చేయగా.. లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆ జట్టు పేసర్లు సత్తా చాటారు. పంజాబ్, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ల్లో మూడేసి వికెట్లు తీసిన మయాంక్ యాదవ్.. ఆ రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక గుజరాత్‌తో జరిగిన మ్యాచ్లో లక్నో 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. యశ్ థాకూర్ ఐదు వికెట్లతో సత్తా చాటడంతో రాహుల్ సేన 33 పరుగుల తేడాతో గెలుపొందింది.

టాప్-4లో అడుగుపెట్టిన చెన్నై

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచింది. సొంత గడ్డ మీద ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ జట్లను ఓడించిన సూపర్ కింగ్స్.. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో.. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడింది. కోల్‌కతాపై గెలవడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

ఐదో స్థానంలో సన్‌రైజర్స్
గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టుడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో స్ఫూర్తిదాయక విజయాలు సాధిస్తోంది. కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై 277 పరుగులతో.. ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. తర్వాత అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్.. చెన్నై, పంజాబ్‌లపై గెలిచి వరుసగా రెండు విజయాలను అందుకుంది. చెన్నైలాగే సన్‌రైజర్స్ ఖాతాలోనూ ప్రస్తుతం ఆరు పాయింట్లు ఉన్నాయి.

పంజాబ్‌కు ఆరోస్థానం..
పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచిన ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్య చేధనలో తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదైనప్పటికీ.. పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఇక సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 2 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన పంజాబ్‌ను శశాంక్ సింగ్ ఒంటి చేత్తో గెలిపించాడు.

పడుతూ లేస్తున్న గుజరాత్..
తొలి సీజన్లోనే ఐపీఎల్ టైటిల్ గెలిచి.. గత సీజన్లోనూ ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్.. రెండింట్లో గెలిచి, మూడింట్లో ఓడింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై
బలమైన జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. హార్దిక్ పాండ్య నాయకత్వంలో బరిలోకి దిగిన ముంబై.. ఈ సీజన్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రొమారియో షెఫర్డ్ ఆఖరి ఓవర్లో 32 పరుగులు చేయడంతో గెలిచిన ముంబై.. ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరించింది. ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

కోహ్లి ఒక్కడే..
ఈ సీజన్లో ఆర్సీబీది మరో కథ. విరాట్ కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. అతడికి సహకరించే బ్యాటర్లు ఆ జట్టులో కరువయ్యారు. మరోవైపు బౌలింగ్‌లోనూ తేలిపోతున్న బెంగళూరు.. ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

అట్టడుగున ఢిల్లీ
రిషబ్ పంత్ సారథ్యంలో బరిలోకి దిగుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక దాంట్లోనే గెలిచింది. విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవి చూసింది. అయితే అదే విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లను కోల్‌కతా బ్యాటర్లు వణికించారు. ఆ మ్యాచ్‌లో కోల్‌‌కతా 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement