Thursday, October 17, 2024

T20 | బంగ్లా మ్యాచ్ కు వ‌రుణుడి దెబ్బ – డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతిలోఆసీస్ విజ‌యం

టీ20 ప్రపంచ కప్ సూప‌ర్ ఎయిట్ మ్యాచ్ లో భాగంగా విండీస్ లోని నార్త్ గ్రౌండ్ లో జ‌రిగిన మ్యాచ్ లో ఆసీస్ పై టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ షాంటో (41), తౌహిద్ (40) రాణించారు. అయితే, మిగతా వారు మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో బంగ్లా ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావాల్సివచ్చింది. కమిన్స్‌తోపాటు (3/29) ఆడమ్ జంపా (2/24) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం 11.2 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 100/2. క్రీజ్‌లో డేవిడ్ వార్నర్ (55), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (14) ఉన్నారు. వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆసీస్‌ను విజేతగా ప్రకటిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌ 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది.

కాగా, ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్ పాట్ కమిన్స్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. వరుస బంతుల్లో బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను ఔట్ చేశాడు. దీంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు కాగా.. ఓవరాల్‌గా ఏడోది. ఇక ఆసీస్‌ తరఫున హ్యాట్రిక్‌ తీసిన రెండో బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. 2007లో బంగ్లాపైనే బ్రెట్‌లీ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఐర్లాండ్‌ బౌలర్ కర్టిస్ క్యాంఫర్ (2021), శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ (2021), దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (2021), యూఏఈ బౌలర్ కార్తిక్ మైయప్పన్ (2022), ఐర్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్ జోష్ లిటిల్ (2022) ఈ ఘనత సాధించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement