బ్రిస్బేన్: ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడవ టెస్టు చివరి రోజు అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు. టెస్టు కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. అతను 106 టెస్టుల్లో 24 యావరేజ్‌లో 537 వికెట్లు తీసుకున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో ఉన్నాడతను. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో .. అశ్విన్ అడిలైడ్ టెస్టులో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను 53 రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన హోం సిరీస్‌లో అతను కేవలం 9 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అశ్విన్ టెస్టుల్లో 3503 రన్స్ చేశాడు. దాంట్లో ఆరు సెంచరీలు, 14 అర్థశతకాలు ఉన్నాయి.
క్రికెట్ ఆల్‌రౌండర్లలో అశ్విన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మూడు వేల రన్స్, 300 వికెట్లు తీసిన 11 ఆల్‌రౌండర్ల లిస్టులో అతను ఉన్నాడు. రికార్డు స్థాయిలో అశ్విన్ 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. మేటి స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో సమానంగా నిలిచాడు.