జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు పోరాటం ముగిసింది. నేడు (గురువారం) జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత స్టార్ ప్లేయర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు కెనడాకు చెందిన మిచెల్ లీ చేతిలో ఓడిపోయింది.
దాదాపు గంటా 15 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు 21-17, 16-21, 17-21 పాయింట్ల తేడాతో కెనడా ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. కాగా, క్వార్టర్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన యు జిన్ సిమ్‌తో మిచెల్ లీ తలపడనుంది.
సింధు ఓటమితో ఈ టోర్నీలో భారత్ ప్రచారానికి తెరపడింది. అంతకుముందు, పురుషుల సింగిల్స్‌లో భారత్ స్టార్ యువ షట్లర్ లక్ష్యసేన్ తొలి రౌండ్‌లో పోరాడి ఓడాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో లక్ష్యసేన్ 22-20, 17-21, 16-21 తేడాతో లియోంగ్ జున్ హవో (మలేషియా) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ గాయత్రి గోపీచంద్-తెరెసా జోడీ కూడా తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.