కామన్వెల్త్ క్రీడల్లో భారత యువశక్తి చరిత్ర సృష్టిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. భారత వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, 19 ఏళ్ల జెరెమి ఆదివారంనాడు 67 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వెంటనే ప్రధాని స్పందించారు. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పాల్గొన్నప్పటికీ, వెరపు లేకుండా సరికొత్త రికార్డుతో స్వర్ణం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఇంత చిన్నవయసులో అద్బుతమైన కీర్తిప్రతిష్టలను సాధించడం గొప్ప విషయమన్నారు. మునుముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్‌లో సత్తా చూపిస్తా – జెరెమి
బర్మింగ్‌హామ్‌లో పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోయా. అయినప్పటికి స్వర్ణపతకం సాధించడంతో ఆనందంగా ఉంది. ఇక నా లక్ష్యం పారిస్ ఒలింపిక్స్. 73 కిలోల విభాగంలో పతకం సాధించేందుకు కృషి చేస్తా. 2011 డిసెంబర్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లోకి అడుగుపెట్టా. మిజోరాంకు చెందిన కోచ్ వద్దే శిక్షణ పొందా. కండరాల ఇబ్బందులతో ఆదివారం సరైన ప్రదర్శన చేయలేకపోయా. ఎంత కష్టపడ్డా ఒక్కోసారి ఆట మన చేతుల్లో ఉండదు. అయినా స్వర్ణం సాధించడంతో ఆనందంగా ఉంది. నాకు మొదటినుంచి కుటుంబం అండగా నిలిచింది. నా తండ్రి ఓ స్నేహితుడిలా చూస్తారు. నా అన్నదమ్ములతో బాక్సింగ్ ఆడుతూంటా. మా తాతకు, కుటుంబ సభ్యులకు స్వర్ణ పతకాన్ని అంకితం చేస్తున్నా.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.