Friday, November 22, 2024

Australian Open | క్వార్టర్స్‌లో ప్రణయ్‌, ఆకర్షి..

ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, ఆకర్షి కశ్యప్‌లు క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించారు. మరోవైపు సమీర్‌ వర్మ ప్రి క్వార్టర్‌ ఫైనల్లో 8వ సీడ్‌ లోహ్‌ కీన్‌ యివ్‌కు షాకిచ్చాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమిత్‌ రెడ్డి-సిక్కిరెడ్డి జోడీ కూడా ముందంజ వేసింది.

నేడు గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఐదో సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-17, 21-15 తేడాతో ఇజ్రాయిల్‌కు చెందిన మీష జిల్బెర్‌మాన్‌ను వరుస గేముల్లో చిత్తు చేశాడు. ఇక్కడ జరిగిన మరో సింగిల్స్‌లో సమీర్‌ వర్మ 21-14, 14-21, 21-19 తేడాతో 8వ సీడ్‌ లోహ్‌ కీన్‌ యివ్‌ (సింగపూర్‌)పై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో కిరణ్‌ జార్జ్‌ 20-22, 6-21 తేడాతో జపాన్‌ స్టార్‌, ఏడో సీడ్‌ కెంటా నిషిమొటో చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగాడు.

మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి 8వ సీడ్‌ ఆకర్షి కశ్యప్‌ 21-16, 21-13 తేడాతో స్థానిక షట్లర్‌ కై కీ తెయోహ్‌ (ఆస్ట్రేలియా)పై వరుస గేముల్లో గెలిచి క్వార్టర్‌ ఫైనల్లో దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ ఇతర ప్రి క్వార్టర్‌ మ్యాచుల్లో అనుపమ ఉపాధ్యాయ 11-21, 18-21తో 6వ సీడ్‌ కుసుమ వర్దాని (ఇండోనేషియా), మళవిక బన్సోద్‌ 17-21, 21-23తో 7వ సీడ్‌ ఈస్టర్‌ నురుమీ ట్రి వార్డొయో (ఇండోనేషియా) చేతిలలో ఓటమిపాలైయ్యారు.

సుమిత్‌-సిక్కి ముందంజ..

మిక్స్‌డబుల్స్‌లో 8వ సీడ్‌ తెలుగు జోడీ సుమిత్‌ రెడ్డి-సిక్కి రెడ్డి 21-11, 21-11 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన కాయ్‌ చెన్‌ తెయోహ్‌-కాయ్‌ కీ తెయోహ్‌ల జంటపై అలవోకగా విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లో దూసుకెళ్లారు. ఆది నుంచే దూకుడుగా ఆడిన భారత జోడీ 25 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ పాండా-స్వేతపర్ణ పాండా ద్వయం పోరాటం ప్రి క్వార్టర్‌ ఫైనల్స్‌లోనే ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement