టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పకు కర్ణాటక పులకేశినగర్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కేసులో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో.. పీఎఫ్ రిజినల్ కమిషనర్ గోపాల్ రెడ్డి రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఊతప్ప సెంచరీస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని నడుపుతున్నాడు. ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని ఈ సంస్థ కట్ చేస్తుంది. అయితే, వారి ఖాతాల్లో మాత్రం పీఎఫ్ జమ కావడం లేదు. దాదాపు రూ.23 లక్షల రూపాయలను ఈ కంపెనీ తన ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదు.
ఈ మోసాన్ని ప్రస్తావిస్తూ.. ఊతప్పని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశిస్తూ పీఎఫ్ కమిషనర్ లేఖ పంపారు. ఈ నెల 27లోపు పీఎఫ్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని, లేనిపక్షంలో అరెస్ట్ తప్పదని వారెంట్‌లో పేర్కొంది. కాగా, రాబిన్ ఊతప్ప కుటుంబం ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.