Saturday, November 2, 2024

IPL | అమరావతి పేరుతో ఐపీఎల్ టీమ్‌…

వచ్చే ఐదేళ్లలో అమరావతి పేరుతో ఐపీఎల్ టీమ్‌ను తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి అన్నారు. అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తామని తెలిపారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్..

క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. ఐపీఎల్‌లో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కేంద్రంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రాతినిథ్యం వహిస్తోంది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేకుండా పోయింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సైతం వైజాగ్ పేరిట ఐపీఎల్ టీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వాలతో అయ్యే పని కాదు..

అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నంత మాత్రానా ఆంధ్రకు కొత్త ఐపీఎల్ టీమ్ వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే 10 జట్లతో ఐపీఎల్ సాగుతోంది. ఇప్పట్లో జట్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేదు. ఐపీఎల్ 2022 సీజన్ ముంగిటనే బీసీసీఐ లీగ్ విస్తరణ చేపట్టడంతో కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు వచ్చి చేరాయి.

- Advertisement -

మళ్లీ లీగ్ విస్తరణ చేపట్టి కొత్త జట్లకు అవకాశం ఇస్తే గానీ అమరావతి పేరిట ఐపీఎల్ టీమ్ వచ్చే అవకాశం లేదు. లీగ్‌లో జట్ల సంఖ్య పెరిగితే మ్యాచ్‌ల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే కిక్కిరిసిన క్రికెట్ షెడ్యూల్ మధ్య ఐపీఎల్‌కు స్లాట్ కేటాయించేందుకు ఐసీసీ చాలా ఇబ్బంది పడుతోంది.

అనేక ఇబ్బందులు..

బీసీసీఐని ఎదురించలేక అంతర్జాతీయ సిరీస్‌లను పక్కనపెట్టి మరి ఐపీఎల్‌కు స్లాట్ కేటాయిస్తోంది. అంతేకాకుండా జట్ల సంఖ్య పెరిగితే.. లీగ్ నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే తుది జట్టులో ఆడే విదేశీ ఆటగాళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ లీగ్ విస్తరణ చేపట్టినా.. సౌతిండియా నుంచే జట్లకు అవకాశం ఇస్తారనే గ్యారంటీ లేదు.

ఎందుకంటే సౌతిండియా నుంచి ఇప్పటికే ఆర్‌సీబీ, సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఉన్నాయి. ఆంధ్రతో పాటు కేరళకు కూడా ఐపీఎల్ టీమ్ లేదు. ఒకవేళ కొత్త జట్లకు అవకాశం ఇస్తే.. ఈశాన్య రాష్ట్రల నుంచి ఒక జట్టు.. ఉత్తర భారత దేశం నుంచి మరో జట్టుకు అవకాశం ఇవ్వవచ్చు.

సౌతిండియాకు ఇచ్చినా.. కేరళకు ముందు అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేరళ నుంచి గతంలో కొచ్చి టస్కర్స్ ఐపీఎల్‌లో ప్రాతినిథ్యం వహించింది. ఇవన్నీ ఇప్పట్లో జరగడం చాలా కష్టం. ఈ క్రమంలోనే అమరావతి పేరిట ఐపీఎల్ టీమ్ రావడం ఇప్పట్లో అయ్యే పనికాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement