పెర్త్ – బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తున్నది. ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాకు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యచేధన కోసం బరిలో దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
బుమ్రా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్ స్వీని ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తరవాత పాట్ కమిన్స్ ను సీరాజ్ పెవీలియన్ కు చేర్చాడు. ఆ వెంటనే లబు షెన్ ను బుమ్రా ఔట్ చేసాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.
అంతకుముందు మూడో రోజు ఆట మొదలవగానే భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తమ నిలకడైన ఆటను కొనసాగించారు. అయితే కాసేపటికి తన వ్యక్తిగత స్కోర్ 77 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత జైస్వాల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత ఆటలో దూకుడు పెంచి 161 పరుగులకు చేరుకున్న తర్వాత ఔటయ్యాడు. జైస్వాల్ ఔట్ తర్వాత పంత్, ధ్రువ్ జురేల్ వెంటవెంటనే ఔటయ్యారు.విరాట్ కోహ్లీ నిలదొక్కుకుని వాషింగటన్ సుందర్ (29), నితీష్ రెడ్డి (38 నాటౌట్) సహకారంతో పరుగుల వరద పారించాడు. మొత్తానికి 145 బంతులను ఎదుర్కొని టెస్టుల్లో తన 30వ సెంచరీని సాధించాడు.
ఇక 6 వికెట్లకు 487 పరుగులు చేసిన అనంతరం ఇండియా తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.. యశస్వీ జైశ్వాల్ (161), కేఎల్ రాహుల్ (77), దేవదత్ పడిక్కల్ (25), పంత్ (1), ధ్రువ్ జురేల్ (1), వాషింగ్టన్ సుందర్ (29) కోహ్లీ (100 నాటౌట్), నితీష్‌కుమార్‌రెడ్డి 38 నాటౌట్‌గా ఉన్నారు. భారత జట్టు 533 పరుగుల ఆధిక్యంలో ఉంది.