Tuesday, November 26, 2024

Paris Olympics – 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్ ఫైన‌ల్స్ లో మ‌ను బాక‌ర్

పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత్‌కు షూటింగ్‌లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. . మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌లో మను బాకర్ అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో భారత షూటర్‌ రిథమ్‌ సంగ్వాన్‌ 15వ స్థానంతో సరిపెట్టుకుంది. మేజర్ వెరొనికా (హంగేరి) 582.22 స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా.. ఓహ్ యే జిన్ (దక్షిణ కొరియా) 580.20 స్కోరుతో రెండో స్థానం దక్కించుకుంది. టాప్-8లో నిలిచినవారు ఫైనల్‌ పోరుకు అర్హత సాధిస్తారు. ఎయిర్‌ పిస్టల్‌ సింగిల్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన భారత షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. 2004 ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో సుమా శిరూర్ ఫైనల్‌కు చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్స్‌ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి.

నిరాశ ప‌రిచిన షూట‌ర్స్ ..

ఇక 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ఎలవెనిల్‌ వలరివన్‌- సందీప్‌ సింగ్, రమిత- అర్జున్‌ బబుతా జోడీలు నిరాశపర్చగా.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్‌ చీమా టాప్‌ 8లో చోటు దక్కకపోవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.

- Advertisement -

మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రమిత-అర్జున్‌ బబుతా జోడీ 628.7 స్కోర్‌తో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మరో జోడీ వలరివన్‌- సందీప్‌ సింగ్ 626.3 పాయింట్లతో 12 స్థానానికి పరిమితమైంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ త్రుటిలో అవకాశాన్ని కోల్పోయాడు. ఒక దశలో టాప్‌3లోకి దూసుకెళ్లినప్పటికీ చివరకు 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అర్జున్‌ చీమా 18వ స్థానానికి పరిమితమయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement