అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) పారిస్ 2024 ఒలింపిక్ హాకీ షెడ్యూల్ను ప్రకటించింది. పారిస్లో జరిగే ఒలింపిక్స్లో 12 పురుషుల హాకీ జట్లు పాల్గొంటాయి. కాగా, ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియా, బెల్జియం, న్యూజిలాండ్, ఐర్లాండ్, అర్జెంటీనా జట్లతో పాటు గ్రూప్-బీలో ఉంది.
భారత పురుషుల హాకీ జట్టు జూలై 27న పారిస్ 2024 ఒలింపిక్స్లో తమ ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. ఆ తర్వాత జూలై 29న అర్జెంటీనా, ఐర్లాండ్ (జూలై 30), డిఫెండింగ్ ఛాంపియన్స్ బెల్జియం (ఆగస్టు 1), ఆస్ట్రేలియా (ఆగస్టు 2)తో భారత్ తలపడనుంది.
ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య ఫ్రాన్స్లు పూల్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ప్రతి పూల్ నుండి మొదటి నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకుంటాయి. ఆగస్టు 4న క్వార్టర్ ఫైనల్స్, ఆగస్టు 6న సెమీఫైనల్ జరుగుతాయి. ఆగస్టు 8న కాంస్య పతక ప్లే ఆఫ్, ఫైనల్ జరగనుంది.